ఎంజీఎంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

May 1 2026 4:10 AM | Updated on May 1 2026 4:10 AM

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన వైద్యసేవలు

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రోగుల వైద్యసేవలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఎంజీఎం పాతగేట్‌ సైకిల్‌ స్టాండ్‌ నుంచి క్యాజువాలిటీకి వెళ్లే దారిలో విద్యుత్‌ స్తంభం కూలిపోయింది. స్తంభం తీగల మీద పడి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఎంజీఎం అధికారులు విద్యుత్‌ సిబ్బందితో మరమ్మతు పనులు ప్రారంభించారు. విద్యుత్‌ లేకపోవడంతో మాన్యువల్‌ పద్ధతిలో ఓపీ చిట్టీలు జారీ చేశారు. ఫిజియోథెరపీ విభాగంలో కూడా బాధితులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం వరకు ఎక్స్‌రేల కోసం పడిగాపులు కాసి ఇంటికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం వరకు విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో కొందరు ఎక్స్‌రేలు తీయించుకున్నట్లు తెలుస్తోంది.

ఫెయిలైన విద్యార్థులకు ఆత్మస్థైర్యం కల్పించాలి

కాళోజీ సెంటర్‌: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన తమ పిల్లలను దూషించకుండా, వారిలో ఆత్మస్థైర్యం కల్పించాలని కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీలత అందె సూచించారు. ఫెయిలైన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. మార్కులు కొలమానం కాదని, పోటీ ప్రపంచంలో ఎదుటి వారితో తమ పిల్లలను పోల్చకూడదని చెప్పారు.

ఇరిగేషన్‌ ఎస్‌ఈ బదిలీ

నర్సంపేట: ఇరిగేషన్‌ శాఖ నర్సంపేట సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) జి.స్వామి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వామిని ములుగు జిల్లా సీఈగా బదిలీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, నర్సంపేటకు ఎవరిని నియమించలేదు.

పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి

న్యూశాయంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో వసతుల కల్పన, అకడమిక్‌ ప్యానల్‌ విజిట్‌, ప్రీప్రైమరీ పాఠశాలల్లో వసతులు, ఆధార్‌, అపార్‌ నమోదు పురోగతి, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాల్లో 10వ తరగతి, ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులకు శిక్షణ, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ వారోత్సవాల నిర్వహణపై చర్చించారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు, అధికారులు పాల్గొన్నారు.

మక్కలతో నిండిన

నర్సంపేట మార్కెట్‌

నర్సంపేట: నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ 20 రోజులుగా మక్కలతో నిండిపోతోంది. గురువారం 1,30,00 బస్తాలు వచ్చాయి. శనివారం నుంచి రైతులు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు తీసుకురావొద్దని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో కోరారు. కాగా, మక్కలను ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజు రోజు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల వడగళ్ల వానలు సైతం కురుస్తుండడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ వర్షం వస్తే ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు పూర్తిగా తడిసిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement