కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్‌కు ఆరంభమని కాళోజీ యూనివర్సీటీ వైఎస్ ఛాన్స్‌లర్ డాక్టర్ రమేష్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహిహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు
ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్లకోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ
డాక్టర్ రమేష్‌రెడ్డి
కాకతీయ వైద్యకళాశాలో
ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు
పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్
వైద్య విద్యార్థులు


