హన్మకొండ: విద్యుత్ వినియోగంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సర్కిళ్లకు నియమించిన నోడల్ అధికారులు వినియోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి విద్యుత్ భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేశారు.
ప్రధాన కారణాలివే..
● విద్యుత్ పరికరాల నిర్లక్ష్యపు వినియోగం, పాడైన, నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం వంటివి చేయొద్దు.
● తెగిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి.
● మీటర్లు, సర్వీస్ వైర్లు, స్విచ్ బోర్డులు తనిఖీ చేయించుకోవాలి.
● చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.
● రైతులు మోటారు స్టార్టర్ల వద్ద ఇన్సులేషన్ సరిగ్గా ఉంచుకోవాలి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయొద్దు.
అవగాహన కల్పిస్తున్నాం..
విద్యుత్ భద్రతపై గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వాల్‌పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకర లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పాత వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఎలాంటి ప్రమాద సూచనలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. 24/7 పనిచేసే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి.
– వరుణ్ రెడ్డి,
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు
ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు
టీజీ ఎన్పీడీసీఎల్
సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి


