వర్ధన్నపేట: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ శనివారం హైదరాబాద్‌లో కలిశారు. తన జన్మదినం సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అరూరిని మాజీ సీఎం ఆశీర్వదించారు.
దివ్యాంగులకు ఇంటి వద్దే బోధన : డీఈఓ
నర్సంపేట: దివ్యాంగ విద్యార్థులకు ప్రతి శనివారం ఇంటి వద్దే సమ్మిళిత విద్య ఉపాధ్యాయులు (ఐఈఆర్పీ) విద్యాబోధన చేస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు పేర్కొన్నారు. నర్సంపేట వల్లభ్‌నగర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థి చరణ్‌నికేష్ ఇంటికి శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయకుడు, సీఎంఓ, సమ్మిళిత విద్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్ వెళ్లారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన మెళకువలను వివరించారు. దివ్యాంగ విద్యార్థులకు ముందస్తుగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వారు అన్నారు. కార్యక్రమంలో సమ్మిళిత విద్య ఉపాధ్యాయురాలు సుచరిత పాల్గొన్నారు.
కొమ్మాలలో వేలం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల అంగడి వేలాన్ని శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ అంగడి ఐదు గ్రామాల పరిధిలో ఉంది. కొమ్మాల గ్రామ పంచాయతీ వాటా కోసం నిర్వహించిన వేలంలో 74 మంది టెండర్‌దారులు పాల్గొన్నారు. వారిలో 17 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా, 8 మంది సీల్డ్ టెండర్లను దాఖలు చేశారు. కొమ్మాల గ్రామానికి చెందిన జూలూరి వేణు రూ.61,11,116 అత్యధికంగా కోట్ చేసి టెండర్ దక్కించుకున్నారు. ఏడాదిలో 20 వారాలపాటు పశువులు, జీవాల రహదారి, ఇతర ఫీజులను వసూలు చేయడానికి ఈ టెండర్ నిర్వహించారు. సర్పంచ్ కన్నెబోయిన యమునప్రవీణ్, ఎంపీఓ పాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజు, ఉపసర్పంచ్ బట్టమేకల శివ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గత ఏడాది వేలంతో పోలిస్తే ఈ సారి అధిక ఆదాయం రానుంది.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సంగెం: సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలకు లోబడి నడుచుకోవాలని న్యాయవాది కల్తి త్రివేణి అన్నారు. మండలంలోని గవిచర్ల మోడల్ స్కూల్‌లో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, బాల్యవివాహాలు, పోక్సో చట్టం, ఈవ్‌టీజింగ్, మైనర్లు వాహనాలు నడిపితే పడే శిక్షలను గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి యువతకు చట్టాలపై అవగాహన ఎంతోముఖ్యమని, చిన్న తప్పిదాలు పెద్ద న్యాయపరమైన సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకుని నడుచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉదాహరణతో చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్పీ ప్రసన్నలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


