● జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు
నర్సంపేట: విద్యా బోధనకు కృత్యమేళాలు దోహదపడుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మండలస్థాయి కృత్యమేళా నిర్వహించారు. తెలుగులో 34, గణితంలో 33, ఆంగ్లంలో 34, ఈవీఎస్‌లో 25 ఎగ్జిబిట్లను డీఈఓ పరిశీలించారు. ఉత్తమ ఎగ్జిబిట్లను తయారుచేసిన 12 మంది విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి కృత్యమేళాలు తోడ్పడుతాయన్నారు. ఉపాధ్యాయులు విభిన్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన కృత్యమేళాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు. వివిధ స్థాయిలో నిర్వహిస్తున్న కృత్యమేళాలను ఉపాధ్యాయులు పరిశీలించి వారి పాఠశాలల్లో ఉపయోగించుకోవాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఓ నాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి కొర్ర సారయ్య, పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రవికుమార్, కృత్యమేళా జడ్జిలు దార్ల రవీందర్, శ్రీనివాస్, భిక్షపతి, గోపాల్‌రావు, మర్ధ వెంకటేశ్వర్లు, రాములు, గోవర్ధన్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


