● బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్
వర్ధన్నపేట: బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మొండిచేయి చూపించిందని బీవీహెచ్‌పీఎస్ (భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఇల్లంద గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా దివ్యాంగులను అణచివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ప్రత్యేకశాఖ ఏర్పాటు వంటి అంశాలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో చేసిందని గుర్తుచేశారు. హామీలను నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఈదయ్య, ఎండీ షరీఫ్, బాలకృష్ణ, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, సుమతి, వీరమ్మ, అలివేలు, పూలమ్మ, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీలకు పాడె: బీజేపీ
గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారంటీలకు పాడె కట్టినట్లుగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన బడ్జెట్‌పై మాట్లాడారు. జిల్లాకు బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఎంజీఎం అభివృద్ధి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కుపై బడ్జెట్‌లో ఊసే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడడం తప్పితే రాష్ట్ర సర్కారు పెద్దగా ఏం కేటాయించలేదని పేర్కొన్నారు. వివాహం చేసుకున్న పేదింటి మహిళలకు తులం బంగారం, పొదుపు సంఘాల వారికి నెలకు రూ.2500, ఫించన్‌ను రూ.4 వేల ప్రస్తావనే లేదన్నారు. బీసీలకు బడ్జెట్‌లో కేవలం నాలుగు శాతమే కేటాయింపులు చేశారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బడ్జెట్‌పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.


