నర్సంపేట: మొక్కజొన్నకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట మార్కెట్ యార్డులో తెలంగాణ మార్క్‌ఫెడ్, నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని, తేమ శాతం నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో తేమ శాతం 14కు మించకుండా ఉండాలని తెలిపారు. క్వింటాలుకు రూ.2,400 ధర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీఓ నీరజ, డీఎం మార్క్‌ఫెడ్ అధికారి రంజిత్‌రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.


