సమస్యలు పరిష్కరించరా?
వరంగల్ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఎదుట పలు కాలనీలవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలపై ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని అధికారులను హెచ్చరించారు. అభివృద్ధి పనులు ప్రాధాన్య క్రమంలో పరిష్కారించేందుకు ప్రతిపాదనలు అందించాలని సూచించారు. గ్రీవెన్స్ సెల్‌కు మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, అందులో టౌన్‌ప్లానింగ్‌కు 42, ఇంజనీరింగ్ సెక్షన్‌కు 19, రెవెన్యూ విభాగానికి 7, హెల్త్ అండ్ శానిటేషన్‌కు 7, తాగునీటి సరఫరాకు 3, ఉద్యాన వన విభాగానికి 1 దరఖాస్తు నమోదైనట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, సీహెచ్‌ఓ రమేశ్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● వరంగల్ పాత కూరగాయల మార్కెట్ ఆవరణలో బయోమిథనైజేషన్ ప్లాంట్ నిర్మాణం చేపట్టకూడదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ హెడ్‌పోస్టాఫీస్‌కు ఎదురుగా చీకటివాడలో డ్రెయినేజీ సిస్టమ్ నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.
● హనుమకొండ బాసిత్ నగర్ క్యూబా కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు దరఖాస్తు అందించారు.
● హనుమకొండ టైఐలర్ స్ట్రీట్ రాజీవ్ గాంధీ విగ్రహానికి సమీపంలో ఉన్న బావిలో చెత్తాచెదారం వేస్తున్నారని తాగునీరు కలుషితమవుతోందని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● మడికొండలో మెర్సి స్క్రాప్ షాపు నుంచి వెలువడే దుర్వాసనను భరించలేకపోతున్నామని చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నివాసితులు పేర్కొన్నారు.
● గుండ్ల సింగారం 39–1–18 నల్లా కనెక్షన్ లేకుండా బిల్లు వస్తోందని మినహాయించాలని రవీందర్‌రెడ్డి కోరారు.
● హనుమకొండ సరస్వతీనగర్‌లో గత 6 నెలలుగా మిషన్ భగీరథ తాగునీరు రావట్లేదని కాలనీవాసులు విన్నవించారు.
● 15వ డివిజన్ గొర్రెకుంటలో లైబ్రరీ, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్‌ను నిర్మించాలని మాదిగ జాగృతి సంఘం అధ్యక్షుడు సిలువేరు రవి ఫిర్యాదు సమర్పించారు.
● 37వ డివిజన్ యస్‌సి మాదిగ శ్మశాన వాటికలో కనీస వసతులు కల్పించాలని స్థానికులు కోరారు.
● 43వ డివిజన్ తిమ్మాపురం పోశాలవాడలో సైడ్ డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు ఫిర్యాదు అందచేశారు.
● వరంగల్ ప్రాంతీయ గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించాలని గ్రంథాలయ సభ్యుడు వంశీ దరఖాస్తు సమర్పించారు.
గ్రేటర్ గ్రీవెన్స్‌లో ప్రజల ఆవేదన
వేగంగా క్లియర్ చేయండి:
కమిషనర్ చాహత్
79 దరఖాస్తుల స్వీకరణ


