వినతులు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె అర్జీలు స్వీకరించి మాట్లాడారు. అధికారులు శాఖల వారీగా సమీక్ష నిర్వహించి పెండింగ్‌లో ఉన్న అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. కాగా, మొత్తం 91 వినతులు అందినట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నేపథ్యంలో మండల ప్రత్యేకాధికారులు తమ పరిధి ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్‌ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ పూర్తికి చర్యలు
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తిచేయడంలో అనుసరించాల్సిన వివిధ అంశాలపై ఆమె దిశా నిర్దేశం చేశారు.


