కేయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నిర్మల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.నిర్మలను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రి న్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ నర్సింహాచారి ఉద్యోగ విరమణ పొందడంతో నిర్మలను నియమించారు. ఏడాది పాటు ఆమె ఈపదవిలో కొనసాగుతారు. ఆమెకు వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు అందజేశారు.
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలోని హోమియో ఆస్పత్రికి ఆయుష్ విభాగం డైరెక్టర్ శరత్‌బాబు తాళం వేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోమవారం అధికారులు స్పందించారు. శనివారం ఆయుష్ విభాగం డైరెక్టర్ శరత్‌బాబు ఎంజీఎం విభాగాన్ని సందర్శించిన సమయంలో యూనాని విభాగం సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రికి తాళం వేసినట్లు తెలిపారు. సోమవారం విధులకు హాజరైన యునాని విభాగం సిబ్బంది ఆయుష్ డైరెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించి శనివారం మేడారం విధులకు హాజరు కావడం కోసం వెళ్లినట్లు తెలుపడంతో యథావిధిగా విధులు నిర్వహించుకోవాలని ఆదేశించినట్లు యూనాని విభాగం వైద్యాధికారి తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల 74 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థులకు (జనరల్), ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో ఇంటర్ జనరల్ విభాగంలో 2,195 మందికిగాను 2,143 మంది హాజరుకాగా, 52 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 759 మంది విద్యార్థులకుగాను 643 మంది హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్‌లో ఇంటర్ జనరల్ విభాగంలో 1,731 మందికి 33 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 798 మందికి 25 మంది గైర్హాజరైనట్లు గోపాల్ తెలిపారు. కాగా, నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ గోపాల్ సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు.
వరంగల్‌లో..
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో జరిగిన జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం జనరల్ విభాగంలో మొత్తం 669 విద్యార్థులకు గాను 654 మంది హాజరైనట్లు, ఒకేషనల్ కోర్సులో మొత్తం 509 మంది విద్యార్థులకు గాను 438 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం 427 మందికి ఏడుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 246 మంది విద్యార్థులకు 9 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు.


