పత్తి యార్డులో సీసీ కెమెరాలు
● కలెక్టర్ లేఖతో స్పందించిన డైరెక్టర్
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీన కలెక్టర్ సత్యశారద పత్తి యార్డును సందర్శించారు. మార్కెట్‌లోని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని కలెక్టర్ ఉద్యోగులను ప్రశ్నించగా లేదు మేడం అని సమాధానం ఇచ్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వెంటనే కలెక్టర్ మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయికి ఫోన్ చేశారు. ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. పత్తి బస్తాల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు వర్షం పడినప్పుడు బస్తాలు తడవకుండా ఉండేందుకు డ్రెయిన్లు నిర్మించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. లేఖతో స్పందించిన మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ వరంగల్ మార్కెట్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం సీసీ కెమెరాల ఏర్పాటు దాదాపు పూర్తి చేశారు. పత్తి యార్డులో పనిచేయని విద్యుత్ బల్బుల స్థానంలో కొత్తవి అమర్చారు. ఏర్పాట్లను మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శి, ఏఎస్ రాజేందర్, సూపర్‌వైజర్ స్వప్న తదితరులు పర్యవేక్షించారు.
పత్తి యార్డులో అమర్చిన సీసీ కెమెరా


