టేకు కలపపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిమ
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని నాలుగో వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కొదురుపాక జగదీశ్వర్ టేకు కలపపై రెండు అడుగుల ఎత్తు, ఒకటిన్నర వెడల్పుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిమను తయారు చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా వారం రోజుల్లో ఆయన ప్రతిమను తయారుచేశానని జగదీశ్వర్ తెలిపాడు. సీఎంకు ఈ ప్రతిమను అందజేస్తానని పేర్కొన్నాడు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
ఖిలా వరంగల్: వైద్య అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు హెచ్చరించారు. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్, అల్లీపురం గ్రామాల్లో శనివారం ఆయన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు చేసే సర్వే రిపోర్టులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
హద్దు రాళ్ల విషయంలో గొడవ
● దాడిచేసిన ఐదుగురిపై కేసు
నర్సంపేట రూరల్: భూమి హద్దురాళ్ల విషయంలో ఒకరిపై దాడిచేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట ఎస్సై గూడ అరుణ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ముత్యాలమ్మతండా శివారులోని జంగాలపల్లి తండాలో పూల్‌సింగ్, బాలు వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. అయితే ఆభూములకు సంబంధించిన హద్దులు తొలగించడంతో బాలు, ఆయన కొడుకులు పూల్‌సింగ్ ఇంటికి శనివారం వెళ్లి అడిగారు. ఈవిషయంలో వారి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. అయితే బాలు, ఆయన కొడుకుతోపాటు మరో ముగ్గురు కలిసి పూల్‌సింగ్‌ను కొట్టారు. వెంటనే పూల్‌సింగ్ అక్కడి నుంచి నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నందనాయక్ తండాలో నగదు చోరీ
గీసుకొండ: మండలంలోని నందనాయక్ తండాలో శుక్రవారం దొంగలు ఓ ఇంటిలోకి చొరబడి రూ.1,05,000 నగదును అపహరించినట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందనాయక్‌తండాకు చెందిన కేలోత్ గోపాల్ తన భార్యతో కలిసి చేను వద్దకు పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటిలోని నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గమనించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశామని, క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
కాళేశ్వరాలయంలో
కార్తీక శోభ
కాళేశ్వరం: కార్తీమాసం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు చేసి అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి పూజించారు. అనంతరం స్వామి వారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు.
టేకు కలపపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిమ


