కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
పర్వతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని మాల్యాలతండా, ఏనుగల్, చౌటపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. వసతులు, ధాన్యం తీసుకొచ్చిన సమయం తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులకు అన్ని వసతులు కల్పించాలని కోరారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని, ధాన్యం తరలింపులో సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలు ఆదివారంలోగా నమోదు చేసి, సాయంత్రంలోగా నివేదికలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
పథకాలు అర్హులకు అందించాలి
న్యూశాయంపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మహిళలు, పిల్లలకు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, మిషన్ వాత్సల్య, శిశు సంరక్షణ కేంద్రాలు, బాల్యవివాహాల నిర్మూలన, పోషణ్ అభియాన్, బేటీ బచావో బేటీ పడావో, చైల్డ్ హెల్ప్‌లైన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని, మొదటి ప్రాధాన్యత తీసుకున్న భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గీజర్లు ఏర్పాటు చేయాలన్నారు. అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో భాగంగా గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులను పాకాల బట్టర్‌ఫ్లై పార్కుకు తీసుకెళ్లాలని కోరారు. నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎకై ్సజ్, వైద్య, ఆరోగ్య, సంబంధిత శాఖల అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహంచాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


