పత్తి, మక్కలకు పరిహారం లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

పత్తి, మక్కలకు పరిహారం లేనట్టే!

Nov 9 2025 7:47 AM | Updated on Nov 9 2025 7:47 AM

పత్తి

పత్తి, మక్కలకు పరిహారం లేనట్టే!

పంటలు నష్టపోయినా

సర్వే చేయని అధికారులు

ప్రథమ ప్రాధాన్యతగా

వరి మాత్రమే పరిగణనలోకి..

అంచనా నివేదికకు

క్షేత్రస్థాయి సర్వేకు భారీ వ్యత్యాసం

ఎకరాకు రూ.10 వేల ఇన్‌పుట్‌ సబ్సిడీపై రైతుల ఆశలు

సాక్షి, వరంగల్‌: మోంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయినా రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పత్తి, మొక్కజొన్న పంటలను సర్వే చేయకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఆశించిన వర్షాలు కురవకపోవడంతో జూలైలో వేలాది మంది రైతులు పత్తి, మొక్కజొన్న పంట సాగు చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో 854 మిల్లీమీటర్ల వర్షానికి 1102.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో ఇబ్బందులు పడ్డారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వానతో పత్తి, మక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే రెండుమూడు సార్లు పత్తి ఏరారని, మొక్కజొన్న పంట మార్కెట్‌లోని కల్లాలకు చేరిందని ఆ పంటల నష్టాన్ని వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలొస్తున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో పత్తి పంట దెబ్బతింది. మోంథా తుపాను నష్టం జాబితాలో ‘స్టాండింగ్‌ క్రాప్‌’ పేరుతో పత్తిని పక్కనపెట్టడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్క వరి పంటకే ప్రథమ ప్రాధాన్యతగా సాగు విస్తీర్ణంలో 33 శాతం నష్టం జరిగినట్లు లెక్కలేశారు.

33 శాతం నిబంధనతో పత్తి పక్కకు..

జిల్లాలోని 58,730 ఎకరాల్లో వరి, 16,420 ఎకరాల్లో పత్తి పంట, 673 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం జరిగిందని. మొత్తంగా 75,823 ఎకరాల్లో నష్టమని అక్టోబర్‌ 30న అంచనా వేశారు. తొమ్మిది రోజుల నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న వ్యవసాయ అధికారులు ఇప్పుడు 28,189 ఎకరాల్లో వరి, 320 ఎకరాల్లో పత్తి, 96 ఎకరాల్లో ఇతర పంటల నష్టం జరిగిందని క్షేత్రస్థాయి సర్వేలో గుర్తించారు. మొత్తంగా 28,605 ఎకరాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే వరి పంట 30,541 ఎకరాలు, పత్తి 16,100 ఎకరాలు, ఇతర పంటలు 577 ఎకరాలు తక్కువని తేలింది. వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటను పట్టించుకోకపోవడం గమనార్హం. సాగు చేసిన విస్తీర్ణంలో 33 శాతం నిబంధనతో దీన్ని పక్కన పెట్టేశారన్న టాక్‌ ఉంది. వర్ధన్నపేట మండలంలో 20 ఎకరాలు, పర్వతగిరిలో 300 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగిందని మాత్రమే అధికారులు సర్వేలో గుర్తించారు. చెన్నారావుపేట మండలంలో మరో 8 గ్రామాల్లో ఆదివారంతో సర్వే పూర్తి కానుంది. ఇంకాస్త వరి పంట నష్టం పెరిగే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.

మండలం సర్వే చేసిన వరి నష్టం పత్తి, ఇతర

గ్రామాలు (ఎకరాల్లో) పంటలు

వరంగల్‌ 5 76 0

ఖిలా వరంగల్‌ 11 1500 30

నర్సంపేట 27 200 0

దుగ్గొండి 34 270 12

నెక్కొండ 18 4,500 0

ఖానాపురం 27 3,502 0

చెన్నారావుపేట 25 2,300 0

నల్లబెల్లి 29 350 0

వర్ధన్నపేట 12 3,500 20

పర్వతగిరి 33 7,000 300

రాయపర్తి 42 3,200 4

సంగెం 33 1,461 15

గీసుకొండ 16 330 35

పత్తి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి..

మోంథా తుపాన్‌తో 16,420 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందని అధికారులే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. క్షేత్రస్థాయి సర్వేలో మాత్రం అసలు పత్తి పంటకు ఏమాత్రం నష్టం లేదన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. జూలై నుంచి కురుస్తున్న వర్షాలతో నష్టం జరిగి పత్తి దిగుబడి తగ్గిపోయింది. వర్షపాత వివరాలను చూస్తే ప్రభుత్వానికి అర్థమవుతుంది. వరి, ఇతర పంటలు నష్టపోయిన రైతుల విషయంలోనూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. నష్టపోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. –సోమిడి శ్రీనివాస్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌

పత్తి, మక్కలకు పరిహారం లేనట్టే!1
1/1

పత్తి, మక్కలకు పరిహారం లేనట్టే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement