బీసీ బంద్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీ బంద్‌ సక్సెస్‌

Oct 19 2025 6:59 AM | Updated on Oct 19 2025 6:59 AM

బీసీ బంద్‌ సక్సెస్‌

బీసీ బంద్‌ సక్సెస్‌

బీసీ బంద్‌ సక్సెస్‌

వాటా కోసం పిడికిలెత్తిన సకల జనులు

ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తే

పాలకవర్గాలకు ప్రమాదకరం

ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తే అది పాలకవర్గాలకు ప్రమాదకరం. కాంగ్రెస్‌ ద్రోహం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పించాయి. మేమెంతో మాకంత వాటా కల్పించాల్సిందే.

–మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి

42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం

బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేదిలేదు. బీసీలకు రిజర్వేషన్ల కల్పించాలనే ఆలోచన సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి అద్దంపట్టే నిర్ణయం.

– ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి

బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం

బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలుకుతున్న పార్టీలు పార్టీ పదవుల్లో 50 శాతం పదవులు ఇవ్వాలి. అప్పుడే పార్టీల నిజాయితీ, చిత్తశుద్దిని నమ్ముతాం.

– ఓబీసీ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజు యాదవ్‌

హన్మకొండ: హనుమకొండ జిల్లాలో బీసీ బంద్‌ ప్రశాంతంగా విజయవంతమైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీలు రోడ్డెక్కారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీయడంతో పోరు హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ నాయకులు, బీసీ సంఘాల నాయకులు వేకువజామునే ఆర్టీసీ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వరంగల్‌–1 డిపో గేట్‌లో బైఠాయించి బస్సులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో బంద్‌ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేశాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌ వడ్లకొండ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు వరంగల్‌ మహానగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ కూడలి నుంచి ములుగు క్రాస్‌ రోడ్డులోని జ్యోతిబా పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌ రాజు ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహంనుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్‌, దొడ్డిపల్లి రఘుపతి, బొనగాని యాదగిరిగౌడ్‌, తమ్మెల శోభారాణి, మూగల కుమార్‌ యాదవ్‌, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చింతం సదానందం, శోధన్‌, పులి రజనీకాంత్‌, పోలెపల్లి రామ్మూర్తి, ముత్తిక రాజు, శ్రీధర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‌ రావు, నాయకులు తోట వెంకటేశ్వర్లు, రవీందర్‌, పోతుల శ్రీమాన్‌, విజయశ్రీ, పల్లకొండ సతీశ్‌, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మండలాల్లో ఇలా..

ఎల్కతుర్తి: ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో శనివారం బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. ఎల్కతుర్తి వామపక్ష పార్టీల నాయకులు బస్టాండ్‌ నుంచి సమీప కూడలి ప్రాంతం వరకు బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, చిరువ్యారులు, పలు షాపుల యజమానులు తమ తమ షాపులు మూసివేసి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

ఐనవోలు: మండలంలోని పున్నేలు క్రాస్‌ వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తక్కళ్లపెల్లి చందర్‌రావు, నాయకులు ఉస్మాన్‌ అలీ, పల్లకొండ సురేష్‌, మిద్దెపాక రవీందర్‌, దుప్పెల్లి కొంరయ్య, దేవదాసు, రామారావు, రాజు, సుదర్శన్‌, ప్రభాకర్‌, రాములు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులు. మండల కేంద్రంలోని పలు దుకాణాలతో పాటు బీఓబీ బ్యాంకును మూసి వేయించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో కాడబోయిన లింగయ్య, మడిగె నాగరాజు మహేందర్‌, నారాయణరెడ్డి, ఉప్పలయ్య, యాకూబ్‌, నాగరాజు, రాంకుమార్‌, రాజేశ్వర్‌రావు, చిన్న రాజు, రాజు, నర్సయ్య, గోపాల్‌, యాకయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు.

దామెర/వేలేరు/ఆత్మకూరు: దామెర, వేలేరు, ఆత్మకూరు మండలకేంద్రాలతో పాటు పలుగ్రామాల్లో బీసీ బంద్‌ విజయవంతమైంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించడంతో బంద్‌ శాంతియుత వాతావరణంలో కొనసాగింది.

కమలాపూర్‌ : కమలాపూర్‌లో బైక్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక బస్టాండ్‌ కూడలి వద్ద హుజూరాబాద్‌–పరకాల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఈ బంద్‌లో బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పరకాల: పరకాలలో విద్యాసంస్థలకు యాజమాన్యాలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. దుకాణాల మూసివేతతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్‌ పి.కాళీప్రసాద్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ సిరంగి సంతోష్‌కుమార్‌, కాంగ్రెస్‌ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు బండి సారంగపాణి పాల్గొన్నారు.

నడికూడ : మండలంలోని పరకాల–హుజూరాబాద్‌ ప్రధాన రహదారిపై వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

బీసీ బంద్‌ ఫొటోలు మరిన్ని : 9లో

గ్రేటర్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల మూసివేత

డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

బీసీ సంఘాలు, వివిధ పార్టీల ర్యాలీలు

స్థానిక ఎన్నికల్లో 42 శాతం

రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌

కేంద్రం మెడలు వంచైనా..

బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శనివారం చేపట్టిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. సకలజనుల సమ్మె తరహాలో బీసీ సమాజమంతా రోడ్లపైకి వచ్చి బంద్‌ సక్సెస్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి చేసిన తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధం అవుతాయి. తెలంగాణలోని బీజేపీ నాయకత్వం ప్రధాని ఒప్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలాకృషి చేయాలి. సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకోవాలన్నారు. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తాం. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు.

– బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌

వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement