
వడివడిగా..
సాక్షి, వరంగల్:
జిల్లావాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను ప్రభుత్వం భూనిర్వాసితుల నుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్‌లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్‌లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు.
మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు..
ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూ యజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవీ రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు.
పాత రోజులు గుర్తొచ్చేలా...
కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్‌లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్‌లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మామునూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు.