
భద్రకాళి అమ్మవారికి పుష్పరథ సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, గోవా ఎమ్మెల్యేలు దేవ్యారాణే, ఐశ్వర్యరాణే, అరుంధతి రాణే ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం పుష్పరథసేవ నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు.
హన్మకొండ కల్చరల్: మహిషాసురమర్దిని అమ్మవారిని కొలిచిన వారికి సర్వశత్రు భయాలు తొలుగుతాయని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో బుధవారం మహాచండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్‌శర్మ రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసురమర్దినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. బెల్లం అన్నం, పులిహోర నైవేద్యం నివేదన చేశారు. వేదపండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు లోకకల్యాణార్థం గణపతినవగ్రహ సుదర్శన మహా చండీహోమం నిర్వహించారు. అనంతరం ఫలపుష్పాలు, సుగంధపరిమళ ద్రవ్యాలు, పట్టువస్త్రంతో మహాపూర్ణాహుతి చేశారు. హోమంలో శాసనమండలి వైస్‌చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ రాష్ట్ర సూపరింటెండెంట్ నిఖిల్‌దాస్ దంపతులు పూజలు నిర్వహించారు. సాయంత్రం తిరునగరి శ్రవణ్‌కుమార్ భక్తిగీతాలు అలరించాయి. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
వరంగల్ డీఐఈఓ శ్రీధర్‌సుమన్
విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బోర్డు వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేక యూనిక్ ఐడీని జారీ చేయనున్నట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా స్టాఫ్ డేటా, ఎంట్రీలో ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్, పాన్ నంబర్, అపాయింట్‌మెంట్ తేదీ తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఇంటర్‌బోర్డు భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలు మూల్యాంకనం, రెమ్యునరేషన్ చెల్లింపులు యూనిక్ ఐడీ ద్వారానే చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలను నమోదు చేయించాలన్నారు. త్వరలో సంబంధిత డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు.

భద్రకాళి అమ్మవారికి పుష్పరథ సేవ