
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!
గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్‌చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.