
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు.
నిష్టగా ఉంటారు..
మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది.
– వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు

మద్యం, మాంసం ముట్టరు