
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్‌పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అది నేటికీ కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు.