సమాచారమిస్తే నిఘా పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

సమాచారమిస్తే నిఘా పెంచుతాం

Sep 28 2025 6:48 AM | Updated on Sep 28 2025 6:48 AM

సమాచా

సమాచారమిస్తే నిఘా పెంచుతాం

నర్సంపేట: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ఊరెళ్లే క్రమంలో ప్రజలు వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో సమాచారం ఇస్తే నిఘా పెంచుతామని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి అన్నారు. పండుగ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని శనివారం చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఏసీపీ సమాధానం ఇచ్చారు.

ప్రశ్న: గతంలో దసరా సందర్భంగా నల్లబెల్లి మండ ల కేంద్రంలో గొడవలు జరిగాయి. అలా జరగకుండా ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు?

– బద్రీనాథ్‌, నల్లబెల్లి

ఏసీపీ: ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పండుగ సమయంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం.

ప్రశ్న: పండుగ పూట ఇబ్బంది కలగకుండా చూడాలి

– నల్ల లింగయ్య, తొగర్రాయి

ఏసీపీ: పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా మండలాల పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేస్తాం. వ్యవసాయ పనులకు వెళ్లే వారి వాహనాలకు జరిమానాలు విధించకుండా చూస్తాం.

ప్రశ్న: ముందస్తు హెచ్చరికలు చేస్తారా?

– మాదాసి రవి, అలంకానిపేట

ఏసీపీ: పండుగల సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ప్రజలకు శాంతిభద్రతలపై అవగాహన కల్పిస్తాం. రాత్రి సమయాల్లో సైరన్‌తో కూడిన పెట్రోలింగ్‌ చేస్తూ చోరీలు, అల్లర్లు జరగకుండా చూస్తాం.

ప్రశ్న: దొంగతనాల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడతారు?

– నరేష్‌ – నల్లబెల్లి, రాజమౌళి – మాదన్నపేట

ఏసీపీ: దొంగతనాల నియంత్రణకు బ్లూ కోట్స్‌ గస్తీ పెంచుతాం. పోలీసులకు స్థానిక యువకులు సైతం పోలీసులకు సహకరించాలి. దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతాం.

ప్రశ్న: సీసీ కెమెరాలు పని చేయడం లేదు

– చింతకింది కుమారస్వామి, నల్లబెల్లి

ఏసీపీ: ప్రజలు, వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలు అదనంగా పెట్టించడంతో పాటు పనిచేయని వాటికి మరమ్మతులు చేపడతాం. రాత్రి సమయాల్లో అసాంఘిక కలాపాలను నియంత్రిస్తాం.

ప్రశ్న: ఊరెళ్తే విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోవచ్చా?

– కందిక చెన్నకేశవులు, నెక్కొండ

ఏసీపీ: విలువైన బంగారం, ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులను బ్యాంక్‌ లాకర్లలో పెట్టుకుంటే మంచిది. ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీ, పెట్రోలింగ్‌ పెంచుతాం.

ప్రశ్న: సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఎలాంటి చర్యలు చేపడతారు?

– మోడెం విద్యాసాగర్‌, తిమ్మంపేట

ఏసీపీ: ప్రతీ మండలంలో సమస్యాత్మక గ్రామాలు గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఘర్షణలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకునే విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం.

ప్రశ్న: బెల్ట్‌ షాపులను నియంత్రించాలి

– తిరుపతి యాదవ్‌, బంధంపల్లి

ఏసీపీ: గ్రామాల్లో ఉన్న బెల్ట్‌ షాపులను మూసివేయిస్తాం. ఎకై ్సజ్‌ శాఖతో కలిసి వాటి నియంత్రణకు కృషి చేస్తాం. పండుగ పూట బెల్ట్‌ షాపుల వల్ల ఇబ్బందులు ఏర్పడితే పోలీసులకు సమాచారం అందించాలి.

ప్రశ్న: మహిళలకు అవగాహన కల్పిస్తారా?

– తలారి గణేష్‌, మర్రిపల్లి

ఏసీపీ: పండుగ సమయంలో మహిళలు ఆభరణాలు ధరిస్తే జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుకులకు సమాచారం అందించాలి.

ప్రశ్న: జీవహింసను నియంత్రిస్తారా..?

– కాట శ్రీనివాస్‌ – జల్లి, ఈదునూరి వెంకటేశ్వర్లు – నెక్కొండ, మాలోతు బాబులాల్‌ – నెక్కొండ

ఏసీపీ: దసరా పండుగ, గాంధీ జయంతి అక్టోబర్‌ 2న వస్తుండడంతో ప్రజలు స్వచ్ఛందంగా మద్యపానం, మాంసం విక్రయాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి జీవహింసకు పాల్పడొద్దు.

ప్రశ్న: హాస్టల్‌ పిల్లలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారా..?

– మచ్చిక రాజు, మహేశ్వరం

ఏసీపీ: మహేశ్వరంలో ఉన్న హాస్టల్‌ పిల్లలు బయట తిరగకుండా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. హాస్టల్‌ ఇన్‌చార్జ్‌లతో మాట్లాడి ప్రత్యేక చర్యలు చేపడతాం.

ప్రశ్న: సైబర్‌ క్రైంలో డబ్బులు పోతే ఎలా..?

– ఆబోతు అశోక్‌యాదవ్‌,

మనుబోతుల గడ్డ

ఏసీపీ: సైబర్‌ వలలో పడి మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేయాలి. గంటలోపు సమాచారం ఇస్తే లావాదేవీలను నిలిపివేస్తాం. ఈ క్రమంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే బాధితులకు సహకారం అందిస్తాం.

ప్రశ్న: ప్రయాణికుల కష్టాలు తీరుస్తారా..?

– గోర్కటి రాజ్‌కుమార్‌, వెంకటాపురం

ఏసీపీ: గిర్నిబావి వద్ద ఆర్టీసీ బస్సులు పండుగ సమయంలో ఆపేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇబ్బందులను తొలగిస్తాం. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను అంటుబాటులో ఉంచుతాం.

విలువైన వస్తువులు బ్యాంక్‌ లాకర్లలో

భద్రపర్చుకోవాలి

ఆపద సమయంలో పోలీసులకు

సమాచారం ఇవ్వాలి

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో ఏసీపీ రవీందర్‌రెడ్డి

సమాచారమిస్తే నిఘా పెంచుతాం1
1/1

సమాచారమిస్తే నిఘా పెంచుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement