
మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి
హన్మకొండ : మంత్రి కొండా సురేఖ ఇల్లును సోమవారం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ముట్టడించారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు నెలకు రూ.18 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. హనుమకొండ రాంనగర్‌లోని సీపీఎం కార్యాలయం నుంచి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ర్యాలీగా బయల్దేరి మంత్రి ఇంటి వరకు చేరుకున్నారు. మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుని బారికేడ్లు అడ్డుగా పెట్టారు. పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో పోలీసులు, సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ టీచర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంత్రి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు, అసోసియేషన్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఎం కార్యాలయానికి చేరుకుంటున్న వారిని కూడా మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకుని హనుమకొండ, కేయూసీ, సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి అంగన్‌వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు సుంచు విజేందర్, బొట్ల చక్రపాణి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు వీరగోని నిర్మల, శోభారాణి, రాజేశ్వరి, రమాదేవి, కే.జమున, హైమావతి, రజిత, అనిత, ఉమాదేవి, ఎండీ మైముద, అంజుమ్, శారద, వందలాదిమంది అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
పోలీసులు, అంగన్‌వాడీల మధ్య
తోపులాట
అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు