కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా

Sep 13 2025 2:29 AM | Updated on Sep 13 2025 2:29 AM

కేయూలో లా కాలేజీ  విద్యార్థుల ధర్నా

కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా

కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలి ఐఐటీ జామ్‌ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అపరిశుభ్రతతోనే వ్యాధులు యువత విరివిగా మొక్కలు నాటాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మొదటి గేట్‌ నుంచి పరిపాలనాభవనం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనాభవనం వద్ద బైటాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు, కేయూ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, వర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుదర్శన్‌ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

వరంగల్‌ లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్‌, క్షమాదేశ్‌ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకుని వరంగల్‌, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధి నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు.

కేయూ క్యాంపస్‌: ఐఐటీ జామ్‌–2026 ప్రవేశ పరీక్షకు గణిత శాస్త్రంలో ఉచిత శిక్షణ (ఆన్‌లైన్‌) అందించనున్నట్లు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గణిత శాస్త్ర కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్‌, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్‌ పరీక్షకు తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారని ఆయా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఐఐటీ ఆచార్యులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ఐఐటీ జామ్‌ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణకు ఆన్‌లైన్‌లో కోచింగ్‌ ఇవ్వబోతున్నట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులు 97012 75354లో సంప్రదించాలని సూచించారు.

హసన్‌పర్తి: అపరిశుభ్రతతోనే వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. 55వ డివిజన్‌ సదానంద కాలనీలో డెంగీ నియంత్రణ చర్యలను శుక్రవారం పర్యవేక్షించారు. డెంగీ పాజిటివ్‌ కేసు నమోదైన బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. స్థానికంగా చేపడుతున్న ఫీవర్‌ సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని పరిశీలించారు. కాలనీలోని పలు వీధుల్లో పర్యటించి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్‌రావు, స్థానిక వైద్యాఽధికారి భార్గవ్‌, మానస, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, సబ్‌ యూనిట్‌ అధికారి ఖాదర్‌ అబ్బాస్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ లచ్చు, కమలాకర్‌, సంతోశ్‌, ఏఎన్‌ఎంలు స్వరూప, రాణి, ప్రశాంత, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

కాజీపేట: యువత విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేశ్‌ అన్నారు. కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి పర్యవరణ పరిరక్షణ ఉద్యమకారుడు కె.ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, రిటైర్డ్‌ అటవీశాఖ అధికారి పురుషోత్తం, హెచ్‌ఎం ఎం.ఫ్రాన్సిస్‌, ఉద్యనవన శాఖ అధికారి రమేశ్‌, ఎంఈఓ మనోజ్‌కుమార్‌, సుంకరి జ్వాలా ప్రశాంత్‌, శ్రీను, అశ్విని, నాగరాజు, వెంకటరమణ, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement