
బాలవికాస సేవలు విస్తరించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
సంగెం: పరకాల నియోజకవర్గంలో బాలవికాస సంస్థ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాలను విస్తరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపురం, కృష్ణానగర్ గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను చైతన్యవంతులను చేయడం, వారి ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడే విషయంలో బాలవికాస ముందు నిలుస్తోందని అన్నారు. బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ మధు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.