ప్రతీకార దాడులకు పాల్పడొద్దు
● నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి
నల్లబెల్లి: చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రతీకార దాడులకు పాల్పడితే ఎంతటివారైన చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామాన్ని నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల హత్యకు గురైన బానోత్ కొమ్మాలు కుటుంబ సభ్యులు విజయ, మోహన్, యశ్వంత్‌లను కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీకార దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో వివిధ కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధినిర్వహణలో నిబద్దత కలిగి ఉండాలని సూచించారు.
తహసీల్దార్ల బదిలీ
సాక్షి, వరంగల్: జిల్లాలో గురువారం తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. నర్సంపేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న బి.రాజేష్‌ను హనుమకొండ జిల్లాకు, కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో పనిచేస్తున్న డి.మంజులను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల వేళ పరిపాలనపరమైన నిర్ణయాలతో ఇతర జిల్లాలకు బదిలీ అయిన కొందరు తహసీల్దార్లను వారి అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి కేటాయిస్తూ భూకార్యనిర్వాహక ముఖ్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా కలెక్టర్లకు రిపోర్ట్ చేయాలంటూ తహసీల్దార్‌లను ఆదేశించారు.


