
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, హాజరైన అధికారులు
కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ అర్బన్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం (జూన్ 3న) జిల్లాలోని 55 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రైతు దినోత్సవ వేడుకలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 55 రైతు వేదికలను సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఉదయం గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అధ్వర్యంలో రైతులు రైతు వేదికల వద్దకు బతుకమ్మ, బోనాలతో, డప్పు చప్పులతో ఊరేగింపుగా రావాలన్నారు. ప్రతి రైతుకు వేదిక వద్ద రైతులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ వాసుచంద్ర, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వేడుకల ఏర్పాట్ల పరిశీలన..
హసన్‌పర్తి: హసన్‌పర్తి రైతు వేదికలో నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఒక్కో క్లస్టర్‌లో వేయిమంది రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
దామెరలో..
దామెర: మండల కేంద్రం, ఊరుగొండలోని రైతువేదికలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి క్లస్టర్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాము, మండల ప్రత్యేక అధికారి మాధవీలత, తహసీల్దార్ ఎండీ. రియాజుద్దీన్, డీఏఓ రవీందర్‌సింగ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఈఓలు తదితరులు ఉన్నారు.
ఎల్కతుర్తిలో..
ఎల్కతుర్తి: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతు వేదికలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సందర్శించారు. శనివారం నిర్వహించే రైతు దినోత్సవ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక క్లస్టర్ పరిధిలో సుమారు వెయ్యి మంది రైతులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ తూర్పాటి సునీత, తహసీల్దార్ గుజ్జుల రవిందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
హన్మకొండ : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 3న నిర్వహించనున్న రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్ పిలుపునిచ్చారు. జిల్లాలోని 55 రైతు వేదికల్లో రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నటు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి, వివిధ పథకాలను రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. రైతుబంధు సమితి నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతులు, ఆయా శాఖల అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.

దామెర రైతు వేదికలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్