
బదిలీల కుదుపు...
కొద్దిరోజులుగా పోలీస్‌శాఖలో హాట్‌టాపిక్
సాక్షిప్రతినిధి, వరంగల్:
పోలీస్‌శాఖలో బదిలీల కుదుపు మొదలైంది. చాలా రోజుల తర్వాత ఉమ్మడి వరంగల్‌లో పలువురు డీఎస్పీ/ఏసీపీలకు స్థానచలనం కలిగింది. నార్త్‌జోన్–1 పరిధిలో పలువురు ఎస్‌హెచ్‌ఓలు బదిలీ కాగా, అడిషనల్ ఎస్పీలు కూడా మారారు. పది రోజుల వ్యవధిలో రేంజ్ పరిధిలో ఐదారు ఉత్తర్వుల ద్వారా 29 మంది ఎస్‌హెచ్‌ఓల బదిలీలు అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్‌హెచ్‌ఓలు మారారు. ఈనేపథ్యంలో త్వరలోనే మరో ఇద్దరు డీఎస్పీలు, భారీ సంఖ్యలో సీఐ/ఎస్‌హెచ్‌ఓల ట్రాన్స్‌ఫర్లు ఉంటాయన్న ప్రచా రం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఒక్కసారిగా బదిలీల కలకలం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన డీఎస్పీ/ఏసీపీల మూకుమ్మడి బదిలీలు కలకలంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 77మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేయగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురికి స్థానచలనం కలిగింది. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్‌కుమార్ డీజీపీ ఆఫీస్‌కు బదిలీ కాగా, ఆ స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేసిన పున్నం రవీందర్ రెడ్డిని నియమించారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ హైదరాబాద్ ‘హైడ్రా’ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమితులు కాగా, సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా ఉన్న పింగిళి ప్రశాంత్‌రెడ్డిని తీసుకొచ్చారు. మామునూరు ఏసీపీ బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసి ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేశ్‌ను, రాచకొండ ‘షీ’టీమ్ ఏసీపీగా పని చేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అదేవిధంగా సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా నియమించగా.. త్వరలో మరో ఇద్దరు నుంచి ముగ్గురు డీఎస్పీలకు స్థానచలనం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఖమ్మం అడిషనల్ డీసీపీగా ఉన్న ఎ.నరేశ్‌కుమార్ భూపాలపల్లి ఏఎస్పీగా నియమించిన డీజీపీ, భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న బోనాల కిషన్ వరంగల్ ఏఎస్పీగా, కొమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఆర్.ప్రభాకర్‌రావును వరంగల్ కమిషనరేట్‌కు అదనపు డీసీపీగా నియమించారు.
త్వరలోనే ఎస్‌హెచ్‌ఓల వంతు..
ఇప్పటికే ఠాణాల్లో ఖర్చీఫ్‌లు..
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పలువురికి త్వరలోనే స్థానచలనం కలగనుంది. వాస్తవానికి ఇరవై రోజుల కిందటే జరుగుతాయన్న ప్రచారం జరిగింది. అయితే ఏసీపీ, డీఎస్పీల బదిలీ తర్వాత ఎస్‌హెచ్‌ఓలపై కసరత్తు జరుగుతోంది. ఈనేపథ్యంలో అప్రమత్తమైన పలువురు సీఐలు ఎస్‌హెచ్‌ఓలుగా ఠాణాల్లో ఖర్చీఫ్‌లు వేసుకుని పోస్టింగ్‌లు పదిలం చేసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారన్న ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా మిల్స్‌కాలనీ పీఎస్‌లో సస్పెండైన ఎస్‌హెచ్‌ఓ వెంకటరత్నం స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పలువురు ఎస్‌హెచ్‌ఓలను బదిలీ చేస్తారన్న చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. హనుమకొండ, హసన్‌పర్తి, సుబేదారి, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్, ఏనుమాములలతో పాటు కమిషనరేట్ పరిధిలోని పన్నెండు ఠాణాల్లో ఎస్‌హెచ్‌ఓల మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులనుంచి హామీలు పొందిన ఇన్‌స్పెక్టర్ల పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. సెలవులో వెళ్లిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తిరిగి విధుల్లో చేరాక ఈ ప్రక్రియ జరుగుతుందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కమిషనరేట్‌పై పట్టు బిగిస్తున్న సీపీ..
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా మార్చి 10న బాధ్యతలు చేపట్టిన సన్‌ప్రీత్‌సింగ్.. కమిషనరేట్‌పై పట్టు బిగించారు. సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోపే సుమారు 18 పోలీస్‌స్టేషన్‌లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతల గురించి ఆరా తీశారు. సబ్‌డివిజన్లు, పోలీసుస్టేషన్‌ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆయన నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులపై పనితీరుపైనా గ్రేడింగ్ చేస్తున్నారు. ఓ కేసులో వివాదాస్పదంగా మారిన మిల్స్‌కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ.. కట్టుదాటితే ఎవరిౖపైనెనా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు.
ఇప్పటికే 8 మంది
డీఎస్పీ/ఏసీపీల బదిలీ
ముగ్గురు అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్
త్వరలో మరికొందరు డీఎస్పీలు..
సీఐలకు కూడా స్థానచలనం?
పోస్టింగ్‌లకు హామీలు పొందిన
ఎస్‌హెచ్‌ఓలు
సెలవులో పోలీస్ కమిషనర్..
వచ్చాక ప్రక్రియ మొదలు