
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: ఈనెల 25న (ఆదివారం)న జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్ల పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలన్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈపరీక్షకు ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో 4,141 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. గ్రామపాలన ఆఫీసర్లు పరీక్ష హనుమకొండ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందని, ఈ పరీక్షకు 132 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, యూపీఎస్సీ అధికారి కేశ్ రామ్ మీనా, ఏసీపీ నరిసింహారావు, ఏఓ గౌరీ శంకర్, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచాలి
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచే విధంగా బడిబాట కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడిబాటపై అవగాహన కార్యక్రమాలు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు సమన్వయంతో జూన్ 6వ తేదీనుంచి నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభంనాటికే యూనిఫామ్స్ సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలలకు అవసరమైన వసతుల కల్పనపై ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లి ఎంఎన్‌ఆర్, ఈజీఎస్ ద్వారా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమాల నిర్వహణపై డీఈఓ వాసంతి సంబంధింత శాఖల అధికారులకు వివరించారు. జెడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా సంక్షేమాధికారి జయంతి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఎంఈఓలు పాల్గొన్నారు.