
నర్సంపేట: అభివృద్ధి పనుల కేటాయింపులో వివక్ష చూపుతున్న నర్సంపేట మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్ల తీరును నిరసిస్తూ గురువారం నిర్వహించిన సాధారణ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్ మాట్లాడు తూ.. నర్సంపేట అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.4.19 కోట్ల మిగులు నిధులు ఉండగా.. వాటి కేటాయింపును అభివృద్ధి పనులకు కౌన్సిలర్లందరికీ సమానంగా కేటాయించాలని ముందుగా కమిషనర్, చైర్‌పర్సన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు రూ.10 లక్షలు కేటాయించడం రాజకీయ కక్ష సాధింపు చేయడమేనన్నారు. కౌన్సిలర్‌గా ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరికీ సమాన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ఎలకంటి విజయ్‌కుమార్, ములుకల వినోదసాంబయ్య, పెండెం లక్ష్మీరామానంద్, ఓర్సు అంజలి అశోక్‌కుమార్ పాల్గొన్నారు.