గోపాల్‌పేట: ఉమ్మడి గోపాల్‌పేటతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందించే కేఎల్‌ఐ డి–8 కాల్వకు సోమవారం రాత్రి నుంచి నీటి సరఫరా నిలిచింది. 15 రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో రైతన్నలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం ఎండలు మండిపోతుండటం.. సాగునీటి సరఫరా మరోమారు నిలిచిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. మరో రెండు నెలల్లో పంటలు చేతికొచ్చేవని.. ప్రస్తుత దశలో సాగునీరు సరిగా అందకపోవడంతో పంటలు దెబ్బతిని ఆశించిన దిగుబడి రాదని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కేఎల్‌ఐ కాల్వలకు సాగునీరు వదిలేలా చూడాలని కోరుతున్నారు.
కామర్స్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు
కొత్తకోట రూరల్: ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్ ఆధారిత అకౌంటింగ్‌కు అధిక ప్రాధాన్యం ఉందని.. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని జడ్చర్ల బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహ ఆచార్యుడు డా. వేముల శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్‌శ్రీపై నిర్వహించిన విస్తృత ఉపన్యాస కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంపొందించుకోవడంతో ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, కామర్స్ విభాగాధిపతి డా. బి.ఈశ్వరయ్య, వైస్ ప్రిన్సిపాల్ రామరాజు యాదవ్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డా. జి.విష్ణుమూర్తి, కామర్స్ విభాగ అధ్యాపకులు కె.శ్రీనివాసులు, శిరీష పాల్గొన్నారు.
రిలే దీక్షలు ప్రారంభం
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉండి తగిన నష్టపరిహారం అందేవరకు పోరాడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. మంగళవారం సర్పంచ్ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలే దీక్షలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుంటున్నప్పుడు తగిన నష్టపరిహారం చెల్లించాలని.. అలాగాకుండా బలవంతంగా ఇంతే ఇస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. 2013లో చెల్లించిన డబ్బుల కంటే మూడురెట్లు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల తీర్మానం మేరకు రైతుల నుండి భూములు తీసుకోవాలని కోరారు. ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలని, బోరుబావులు, తోటలు ఇతరాలకు నష్టపరిహారం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం నుండి రిలే దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండ్ల రాజు, బుద్దారం చెరువు నిర్వాసితులు పాల్గొన్నారు.


