బ్యాంకు గ్యారెంటీలిచ్చిన మిల్లర్లకే ధాన్యం | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు గ్యారెంటీలిచ్చిన మిల్లర్లకే ధాన్యం

Oct 7 2026 2:22 AM | Updated on Oct 7 2026 2:22 AM

వనపర్తి: జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకు గ్యారెంటీలు సమర్పించిన రైస్‌మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తేల్చి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఖరీఫ్‌ 2026–27 సీజన్‌ వరి ధాన్యం కేటాయింపులపై రైస్‌మిల్లర్ల(డిఫాల్ట్‌ జాబితాలో లేని మిల్లర్లు)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 43 రైస్‌మిల్లులు నాన్‌న్‌డిఫాల్టర్‌ జాబితాలో ఉన్నాయని, ఆయా మిల్లులకు వరి ధాన్యం కేటాయింపులు చేస్తామన్నారు. ప్రతి మిల్లర్‌ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న మిల్లర్లకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు..

రైస్‌మిల్లర్లు పలు సమస్యలను అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గోదాముల వద్ద ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం జరుగుతోందని, మిల్లింగ్‌ ఛార్జీల సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్‌, అన్‌లోడింగ్‌ తదితర అంశాల్లో అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి ఖరీఫ్‌ సీజన్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ హరీశ్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఆంజనేయులు, సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement