వనపర్తి: జిల్లాలోని మహిళలు, గర్భిణుల్లో రక్తహీనతను పూర్తిగా నివారించి రక్తహీనత లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాల్ని చేపడుతున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి సకాలంలో చికిత్స అందించడంతో తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. రక్తహీనత నివారణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని.. విజయవంతం చేసేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సామ్, మ్యామ్ పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గతేడాది జిల్లాలో 438 మంది సామ్ పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 106 మందికి తగ్గిందని తెలిపారు. ఎక్కడైనా సామ్, మ్యామ్ పిల్లలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి పోషక పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోషణ మాసం ముగింపు కార్యక్రమంలో భాగంగా పలువురు గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అనంతరం పలువురు చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను కలెక్టర్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి హరికృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. భాస్కర్‌నాయక్, డీపీఆర్వో సీతారాం పాల్గొన్నారు.


