సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్త : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్త : ఎస్పీ

Oct 7 2026 2:22 AM | Updated on Oct 7 2026 2:22 AM

వనపర్తి: తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) సూచనల మేరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్‌ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్‌ క్రైమ్‌ అవగాహన వాల్‌పోస్టర్లను ఎస్పీ డి.సునీతరెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, తెలియని ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని తెలిపారు. ముఖ్యంగా పార్ట్‌టైమ్‌ జాబ్‌, లోన్‌యాప్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు వంటి వాటిని ఎరగా వేసి సైబర్‌ నేరగాళ్లు ప్రజలను తమ వలలోకి లాగుతున్నారన్నారు. తెలియని వ్యక్తులను నమ్మి డబ్బులు పంపవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ ఖాతా సమాచారం, ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌లు ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే cybe-r-crime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే మోసపోయిన మొత్తాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల మొత్తం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, మార్కెట్లు, సూపర్‌ మార్కెట్లు, కమ్యూనిటీ ప్రాంతాలు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో సైబర్‌ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా, బతుకమ్మ, ఇతర ప్రజా సమూహ కార్యక్రమాలను కూడా సైబర్‌ అవగాహనకు వేదికలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, ఐటీసెల్‌ విభాగం ఎస్‌ఐ నరేష్‌, సైబర్‌క్రైమ్‌ ఎస్‌ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement