జూరాలకు నీటి విడుదల నిలిపివేసిన కర్ణాటక ప్రభుత్వం
5 ఎకరాల్లో వరి..
రూ.3 లక్షలు నష్టపోతా..
నవంబర్ వరకే..
30– 40 వేల ఎకరాల్లో..
గద్వాల: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాధారిత పంటలు పూర్తిగా దెబ్బతినగా.. జూరాల నీటి ఆధారంగా సాగు చేసిన వరిపంట చివరికి దక్కుతుందా.. లేదా.. అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. జూరాల జలాశయంలో లైవ్ స్టోరేజీ కింద 4.5 టీఎంసీల నీటి లభ్యతతోపాటు కర్ణాటక వదులుతామన్న 5 టీఎంసీల ఆధారంగా అధికారులు నవంబర్ వరకు వారాబందీ విధానంలో పంటలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా కర్ణాటక కృష్ణాబేసిన్‌లో జూరాలకు నీటి విడుదల నిలిపివేయడంతో జూరాల, నెట్టెంపాడు కింద సాగైన పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో సరిగ్గా చేతికొచ్చే దశలో సాగునీటి సమస్య ఎదురై పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
శుక్రవారం నుంచి అమలులోకి..
జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలతోపాటు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. అయితే జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు పూర్తిగా నిలిచిపోవడంతో జలాశయంలో అందుబాటులో ఉన్న 4.5 టీఎంసీల లైవ్ స్టోరేజీ ఆధారంగా వారాబందీ పద్ధతిలో పంటలకు సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించి.. శుక్రవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. వాస్తవానికి సాగైన పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే కనీసం 5– 6 టీఎంసీల నీరు అవసరం కాగా.. అయితే ప్రస్తుతం జూరాలలో 4.5 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. మరి వారాబందీ విధానంతో ఈ పంటలు పూర్తిస్థాయిలో పండుతాయా.. అన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది.
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో
మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు (ఫైల్)
జూరాల, నెట్టెంపాడు కింద
2.50 లక్షల ఎకరాల్లో సాగు
ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే లైవ్ స్టోరేజీ
నవంబర్ వరకు వారాబందీతో సాగునీరు విడుదల
అయోమయంలో చివరి ఆయకట్టు రైతులు
నా కున్న ఎకరాల్లో వరిపంట సాగుచేశా. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంటపూర్తిగా చేతికి రావాలంటే డిసెంబర్ వరకు నీళ్లు కావాలి. వారాబందీతో నవంబర్ వరకు నీళ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మరి మేం వేసుకున్న పంటలు పరిస్థితి ఏం కావాలి. ప్రభుత్వం స్పందించి పంటలు కాపాడాలి. – ఆంజేయులు
రైతు, కొండేరు, ఎర్రవల్లి మండలం
జూరాల ఎడమ కాల్వ కింద 9 ఎకరాల్లో వరిపంట సాగుచేశాను. ప్రస్తుతం వారాబందీ అంటూ మరోమారు కాల్వలకు సాగునీరు నిలిపివేశారు. ఇకపై కాల్వలకు సాగునీరు ఇస్తారో.. లేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి పంట మాత్రం చేతికి అందే పరిస్థితి కనిపిస్తలేదు. అలా అయితే నేను రూ.3 లక్షల మేర నష్టపోతాను. – వెంకటేష్, రైతు,
గుంటిపల్లి, ఆత్మకూర్ మండలం
జూరాల జలాశయంలో ప్రస్తుతం 8.5 టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ 3.7 టీఎంసీలు కాగా.. లైవ్ స్టోరేజీ కింద 4.5 టీంఎసీలు. ఈ క్రమంలో లైవ్‌స్టోరేజీ కింద ఉన్న 4.5 టీఎంసీల నీటి నుంచి వారాబందీ విధానంతో నవంబర్ వరకు సాగునీరు విడుదల చేస్తాం. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలు కాపాడుకోవాలి.
– వెంకట్, డీఈ, ఇరిగేషన్‌శాఖ
వారాబందీ విధానంతో నవంబర్ వరకు సాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే జూరాల కుడి ప్రధాన కాల్వ పరిధిలో ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలు, ఎడమ కాల్వ పరిధిలో పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండాలల్లోని చివరి ఆయకట్టు సుమారు 30– 40 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీరు ఇవ్వాలి. మరి వారాబందీ అమలు చేస్తున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.


