వనపర్తి: సర్ ప్రక్రియతో ఉద్దేశపూర్వకంగా ఓట్లు గల్లంతవుతున్నాయని.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపడుతున్నా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు నిమ్మకుండటం బీజేపీతో అనైతిక మైత్రే కారణమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం బీజేపీ అధికారం చేపట్టేందుకే విపక్షాల ఓట్లను గల్లంతు చేసేందుకు సర్‌ను వినియోగించుకుంటుందని.. అందుకు సహకరిస్తున్న కేంద్ర ముఖ్య ఎన్నిక అధికారి జ్ఞానేష్‌కుమార్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సహచర ఎన్నికల అధికారులు సర్ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న లోపాలను సరిచేసుకునేందుకు 14 సార్లు లేఖలు రాసినా.. కేంద్ర ఎన్నికల అధికారిగాని, కేంద్ర ప్రభుత్వంగాని ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నిసార్లు గగ్గోలుపెట్టినా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల ఓ ఇంగ్లిష్ దినపత్రికలో ఆధారాలతో వచ్చిన వార్తా కథనానికి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చలనం వచ్చిందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇందుకు ప్రధాన కారణమైన జ్ఞానేష్‌కుమార్‌ను సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టి చర్యలు తీసుకునే వరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భారత ఎన్నికల సంఘం కొంతకాలంగా బీజేపీ సంఘంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు, నీట్ నిర్వహణపై దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన నిరసనల మాదిరిగానే సర్ ప్రక్రియపై ఒక్కసారి అన్ని పార్టీలతో కలిసి ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పుర చైర్‌పర్సన్ మాధవి, సీపీఎం నాయకులు ఎండీ జబ్బార్, పుట్టా ఆంజనేయులు, కురుమయ్య, సీపీఐ నాయకులు రమేష్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రహీం, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, వివిధ పార్టీల ప్రతినిధులు బాబుగౌడ్, గణేష్, మండ్ల రాజు, పసుపుల తిరుపతయ్య, బ్రహ్మచారి, కోళ్ల వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


