కొత్తకోట: నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా కోర్టు కానిస్టేబుళ్లు సమర్థవంతంగా పనిచేయాలని డీఎస్పీ గిరిబాబు అన్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో కొత్తకోట సర్కిల్ పరిధిలోని కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించడం, నిందితులకు శిక్షలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేసు నమోదు నుంచి తీర్పు వెలువడే వరకు ప్రతి దశను కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు. నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన రుజువులు, కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు తదితర ఆధారాలను సకాలంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. సాక్షులు, బాధితులు నిర్ణీత తేదీల్లో తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, కేసుకు సంబంధించి అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. కోర్టు నుంచి అందే సమాచారం, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సైలు, దర్యాప్తు అధికారులకు చేరవేయాలని తెలిపారు. దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ప్రాసిక్యూషన్ మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని కోరారు. అనంతరం పెండింగ్ కేసులు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. ప్రతి కేసు పురోగతిని సంబంధిత కోర్టు డ్యూటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సమన్లు, వారెంట్లను సకాలంలో అమలు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. కొత్తకోట సీఐ ఓడీ రమేష్, ఎస్సైలు విక్రమ్, జలంధర్‌రెడ్డి, సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం
వనపర్తి: న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గౌరెడ్డి కోటేశ్వర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా సి.తిప్పన్న, గౌరవ అధ్యక్షుడిగా అశ్వక్ అహ్మద్, ఉపాధ్యక్షులుగా అంజద్‌ఖాన్, జెట్టి మోహన్, డి.అరుణ, ప్రధానకార్యదర్శిగా ఎస్.శ్రీనివాసులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.మన్యంకొండ, కోశాధికారిగా ఎండీ జావేద్, పలువురు కార్యవర్గసభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు కోటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
వనపర్తి: జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌్‌షిప్–2026 పోటీలు జిల్లాకేంద్రంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొలిరోజు డబుల్స్ విభాగం మ్యాచ్‌లు నిర్వహించగా.. శనివారం రెండోరోజు సింగిల్స్ విభాగం పోటీలు జరిగాయి. సింగిల్స్ విభాగంలో మొత్తం 40 మంది క్రీడాకారులు పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చారు. పోటీలు క్రీడాభిమానులను ఆకట్టుకున్నాయి.


