పాన్‌గల్: రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు తెల్లరాళ్లపల్లితండా, తెల్లరాళ్లపల్లి, వెంగళాయిపల్లి, బండపల్లి, అన్నారం, దావాజిపల్లి, శాగాపూర్‌తండా, జమ్మాపూర్, రేమద్దుల, నిజామాబాద్, బండపల్లి, కొత్తపేట, చిక్కేపల్లి, మాధవరావుపల్లి, కిష్టాపూర్‌తండాలో వివిధ అభివృద్ధి పనుల భూమి పూజ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నా జనం మాత్రం దుబారా ఖర్చులకు అలవాటు పడి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని.. మార్పు రావాలని కోరారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. వయోజనులు కూడా చదవడం, రాయడం నేర్చుకోవాలని, చదువుకుంటేనే అభివృద్ధి పనుల గురించి అడగాలన్నారు. తెల్లరాళ్లపల్లిలో గ్రామస్తులకు పలకలు అందించేందుకు తనవంతుగా రూ.10 వేలు అందించారు. దీంతోపాటు గ్రామాల్లో అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మాగాంఽధీ విగ్రహాల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని, తనవంతు రూ.25 వేలు ప్రకటించారు. గుడిసెల్లో ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు అందించాలని, అనర్హులకు కేటాయిస్తే అధికారులు, కమిటీ సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యుత్ డిమాండ్ పెరిగింది..
ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. రోజు 19 వేల మెగావాట్ల వినియోగం అవుతుందని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత లేదన్నారు. వినియోగం, ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, పాన్‌గల్ సర్పంచ్ నాగలక్ష్మి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, ఉస్మాన్, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్‌యాదవ్, అరవింద్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.


