● కేఎల్‌ఐ డీ–8 ఎంజే–4 కాల్వకు
నీరందక ఇక్కట్లు
పాన్‌గల్: మండలంలోని దావాజిపల్లికి చెందిన రైతులు సాగునీటి కోసం శనివారం వనపర్తి–కొల్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగునీటి కోసం అనేక పర్యాయాలు నీటిపారుదల కార్యాలయం, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా సరఫరా చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు కాస్త మెరుగుపడగా ప్రస్తుత ఎండలకు ఎండుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేఎల్‌ఐ డీ–8 ఎంజే–4 కాల్వలకు ఒక్కరోజు రాత్రి నుంచి ఉదయం వరకు నీటిని వదిలి తర్వాత నిలిపివేశారన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న మండలంలోని గోప్లాపూర్, అన్నారం, దావాజిపల్లి, దొండాయిపల్లి రైతులకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని.. పంటలను ఎండనివ్వమని చెప్పిన నాయకులు ఇటువైపు కన్నెతి చూడటం లేదన్నారు. మరోవైపు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా గాకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కాల్వ నీటితో చెరువులను నింపితే తాగునీటి బోర్లలో భూగర్భ జలమట్టం పెరిగి ఇబ్బందులు తొలగుతాయని వివరించారు. రాస్తారోకోతో కొల్లాపూర్, వనపర్తి వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కుర్మయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రైతులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, చిన్నమాసిరెడ్డి, గురవయ్యగౌడ్, వెంకటేష్, కొండారెడ్డి, బాలకృష్ణ, బారిమామ్, చంద్రయ్యయాదవ్, కొందడరాంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


