కొత్తకోట రూరల్: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని.. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షల సాయం అందించారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని రామనంతాపురం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త బజారు ఆంజనేయులు (30) మృతి చెందడంతో శనివారం గ్రామానికి చేరుకొని ఆంజనేయులు కుమార్తెలు కావ్యశ్రీ, కీర్తన పేరిట వేర్వేరుగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎఫ్‌డీ బాండ్లు అందజేయడంతో పాటు తల్లికి రూ.50 వేలు, భార్య మనీషాకు రూ.50 వేలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయులు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సమయంలోనూ ఆర్థిక సాయం అందించామని అయినప్పటికీ కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమార్తెల భవిష్యత్ చదువులకు అండగా ఉంటామన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ మాజీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, బీఆర్‌ఎస్ దేవరకద్ర మహిళా విభాగం ఇన్‌చార్జ్ జయంతి, పి.విశ్వేశ్వర్, సాక బాలనారాయణ, కౌన్సిలర్ అయ్యన్న పాల్గొన్నారు.


