భూముల లెక్క పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూముల లెక్క పక్కాగా చేపట్టాలి

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా.. రెండో విడతలో మరో 2వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో చేసిన తప్పులు రెండో దశలో పునరావృతం కానివ్వొద్దని అధికారులకు సూచించారు. మూడు, నాలుగో విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ జనావాస ప్రాంతంలో పూరిగుడిసె ఉండనియ్యమన్నారు. అంతకు ముందు జిల్లాలో పలు భవనాల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. శ్రీరంగాపురం, ఆత్మకూర్‌, వీపనగండ్ల, చిన్నంబావి తహసీల్దార్‌ కార్యాలయాలకు రూ. 2.25కోట్ల చొప్పున, వనపర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రూ.2.10 కోట్లతో నిర్మించేందుకు కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అదే విధంగా పెద్దమందడి మండలం వెల్టూరు శివారులో రూ. 12.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, వనపర్తి మండలం చిట్యాల శివారులో రూ. 10 కోట్లతో బీసీ గురుకులం జూనియర్‌ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి నల్ల చెరువులో ఉచిత చేపపిల్లలను వదిలారు.

వనపర్తి: గత పాలకులు తీసుకొచ్చిన ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రీసర్వే ప్రక్రియను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా గ్రామాల సరిహద్దులను పక్కాగా నిర్ధారించుకుని, ఆ తర్వాత భూముల సర్వేను పక్కాగా చేపట్టాలన్నారు. సోమవారం వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహనిర్మాణం, భూముల రీసర్వే అంశాలపై నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆరా తీశారు. అలాగే రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి విలేకర్లతో మాట్లాడారు. సుమారు 120 ఏళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని.. మళ్లీ ఇప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రీసర్వే ప్రక్రియను చేపట్టిందన్నారు. ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో తొలి దశలో రీ సర్వే చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని 413 నక్షాల్లో లేని గ్రామాలను సైతం సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్‌ స్థాయి నుంచి కలెక్టర్‌ వరకు అధికారులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి రీ సర్వే ప్రక్రియను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. నవంబర్‌ 15వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వే విషయంలో అటవీ, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

120 ఏళ్ల తర్వాత సమగ్ర సర్వే..

ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే రీ సర్వే

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

నవంబర్‌ 15లోగా రీ సర్వే పూర్తి చేయాలి

అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement