వనపర్తి రూరల్: నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని.. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్ సూచించారు. పెబ్బేరు మండలం సూగూరులో ఆరు నెలల చిన్నారికి డెంగీ నిర్ధారణ కావడంతో మంగళవారం ఆయన చిన్నారి ఇంటిని సందర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉందని కుటుంబ సభ్యులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రోజు యాంటి లార్వా సర్వే నిర్వహించి దోమల వృద్ధిని అరికట్టాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. డెంగీ నివారణకు ప్రజలు, వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. వంశీకృష్ణ, ఆరోగ్య విస్తరణ అధికారి దామోదర్, ఆరోగ్య విస్తరణ అధికారి నర్సింహారావు, హెల్త్ అసిటెంట్లు రాజశేఖర్, తిరుపతయ్య, ఏఎన్‌ఎం అనురాధ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.


