పీఆర్సీ సాధిస్తాం : ఎమ్మెల్సీ | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీ సాధిస్తాం : ఎమ్మెల్సీ

Sep 4 2026 12:42 AM | Updated on Sep 4 2026 12:42 AM

ఆత్మకూర్‌: పీఆర్సీ సాధిస్తామని.. త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో కొత్తగా నిర్మించిన పీఆర్టీయూ టీఎస్‌ సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయిస్తామని, ఉద్యోగుల హెల్త్‌కార్డుల సేవలు మరింత మెరుగుపరుస్తామని, బకాయిలు విడుదల కానున్నాయని వివరించారు. పీఆర్టీయూ సంఘానికి ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లోనే పక్కా భవనాలుండగా.. ప్రస్తుతం ఆత్మకూర్‌లో సొంత భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రహ్మతుల్లా, మాజీ ఎంపీపీలు శ్రీధర్‌గౌడ్‌, వీరేశ లింగం, నాయకులు నాగేష్‌, శ్రీను, రవియాదవ్‌, కోటేష్‌, రామకృష్ణ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్దారెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్‌, రవీందర్‌గౌడ్‌, వర్కటం శ్రీనివాస్‌రెడ్డి, వగ్గు రాఘవేందర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అధికారుల తనిఖీ

వనపర్తి రూరల్‌: వినియోగదారుల ఫిర్యాదు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌ను లీగల్‌ మెట్రాలజీ అధికారి రవీందర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ యంత్రం వినియోగించాలని సూచించారు. వాటర్‌ బాటిల్‌, కూల్‌డింక్స్‌, పాప్‌కార్న్‌లు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ వసూలు చేయరాదన్నారు. ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ స్కేల్‌ చట్టవిరుద్ధంగా ఉన్నందున కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. వేంకటేశ్వర, శ్రీరామ థియేటర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అలాగే గాంధీచౌక్‌లోని బంగారు దుకాణంలో కూడా తనిఖీలు చేసి ముద్రలు లేని రెండు తూకపు యంత్రాలను గుర్తించి కేసు నమోదు చేశామని వివరించారు.

కార్మికుల శ్రేయస్సే ధ్యేయం

కొల్లాపూర్‌/ అచ్చంపేట రూరల్‌: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సే తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ధ్యేయం అని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కొల్లాపూర్‌ డిపో వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసం టీఎంయూ కృషిచేస్తోందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎంత వరకై నా పోరాడుతామన్నారు. త్వరలో జరగబోయే ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు అశ్వత్థామరెడ్డితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌తో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించి డిపో వరకు వెళ్లారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో సమీపంలో టీఎంయూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, మధు, ఎన్నికల పర్యవేక్షకులు వహీదొద్దీన్‌, అచ్చంపేట డిపో అధ్యక్షుడు జంగిరెడ్డి, కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement