వనపర్తిటౌన్: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు తప్పుడు నమోదులను అడ్డుకోవడంలో కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ జిల్లా కన్వీనర్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్‌ఐఆర్ రెండోదశ ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని 322 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈఆర్వోల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను అధికారులకు సమర్పించేలా చూడాలన్నారు. జాబితాలో ఉన్న డబుల్ ఓట్లు, తప్పుడు సమాచారంతో నమోదైన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించి అడ్డుకోవాలని మార్గదర్శనం చేశారు. 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా సహకరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సబిరెడ్డి, వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కేతూరి బుడ్డన్న, న్యాయవాది విజయభాస్కర్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శివారెడ్డి, బాబురావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, కౌన్సిలర్ విజయ్‌సాగర్, సీనియర్ నాయకులు చిత్తారి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మనివర్ధన్‌సాగర్, రాయన్న సాగర్, చిన్నరాయుడు, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


