అలంపూర్ రూరల్: ప్రసాద్ స్కీంలో భాగంగా అలంపూర్ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్‌లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్, లైట్‌షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్, లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.


