మదనాపురం: రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడకుండా నేల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో కేవీకే సహకారంతో నిర్వహించిన ఆర్‌పీఎల్ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయంలో వస్తున్న మార్పులు, రైతులు పాటించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి సూచించిన విధంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించడంతోనే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. యాప్ ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఎరువులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏడీఏ ఆధ్వర్యంలో యాప్ పనితీరును రైతులు, సిబ్బందికి క్షుణ్ణంగా వివరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మ డీపీడీ హై మావతి, కొత్తకోట ఏడీఏ షేక్ మున్నా, మదనాపూర్, కొత్తకోట మండల వ్యవసాయ అధికారులు గాయత్రి, జాస్మిన్, వ్యవసాయ విస్తరణ అధికారులు, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.
నేడు హాకీ పోటీలు
వనపర్తిటౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలో హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్‌వైఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.కుమార్, అధ్యక్షుడు మన్యం యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధ్యాన్‌న్‌చంద్ జయంతి సందర్భంగా యువజన, క్రీడలశాఖ, విద్యాశాఖ, జిల్లా హాకీ అసోసియేషన్‌న్ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని హాకీ క్రీడాకారులతో పాటు పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.
రూ.5 లక్షల ఎల్వోసీ అందజేత
వనపర్తిటౌన్: వెన్నెముక సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడుకు చెందిన పద్మమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల ఎల్వోసీ మంజూరైంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖను సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్‌చార్జి డా. జి.చిన్నారెడ్డి శుక్రవారం ఆమె కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి అందజేశారు. చికిత్సకు సంబంధించిన వైద్యుల నివేదిక ఆధారంగా ఎల్వోసీ మంజూరైనట్లు తెలిపారు. సకాలంలో స్పందించి సాయం అందించిన చిన్నారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


