కొత్తకోట రూరల్/గోపాల్‌పేట: కొత్తకోటతో పాటు రేవల్లి మండలం నాగపూర్‌లో శుక్రవారం డెంగీ కేసులు నమోదయ్యాయి. కొత్తకోట 11వ వార్డు కాజియా మసీద్ ప్రాంతానికి చెందిన మునీబ్ (6), అబుబాకర్ (5) అన్నదమ్ములు, 13వ వార్దులోని వాగ్ధేవి (4)కి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ కావడంతో టి–హబ్‌కు నమూనాలు పంపించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. ఆసియాబేగం తెలిపారు. చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పుర అధికారులను అప్రమత్తం చేయడంతో ఇంటి పరిసరాలతో పాటు మసీద్ ప్రాంతంలో స్వచ్ఛ చర్యలు చేపట్టాలని పుర సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్ సూచించారు.
● రేవల్లి మండలం నాగపూర్‌కు చెందిన అక్షితకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు రేవల్లి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా శుక్రవారం డెంగీగా నిర్ధారణ కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యరు. డా. చాంద్‌పాషా స్థానిక అధికారులతో కలిసి గ్రామానికి చేరుకొని బాలికను పరీక్షించడంతో పాటు ఇంటి పరిసరాల్లోని 17 మంది రక్త నమూనాలు సేకరించారు.


