ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. గురువారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 93.898 మి.యూ., దిగువన 1 యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 78.750 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 172.648 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 3,510 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు.
నానో యూరియా
వినియోగించాలి
ఖిల్లాఘనపురం: రైతులు వరి సాగులో నానో యూరియా వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఆత్మ డీపీడీ హైమావతి సూచించారు. గురువారం జిల్లా వ్యవసాయశాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్తంగా మండలంలోని మానాజీపేట, సోళీపురం గ్రామాల్లో రైతులకు క్షేత్రస్థాయిలో నానో యూరియాను ఎలా వినియోగించాలో చూపించడంతో పాటు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంటకు పాస్పరస్ సాలిబుల్ బ్యాక్టీరియా ఎకరాకు రెండు కిలోల చొప్పున పశువుల ఎరువులో కలిపి పంటలో చల్లితే నిల్వ ఉన్న భాస్వరం ఎరువులు కరిగి పంటకు ఉపయోగపడుతుందన్నారు. నానో యూరియా పని చేస్తుందా లేదా అనే అనుమానాలు చాలామంది రైతులకు ఉన్నాయని.. కచ్చితంగా పంటకు మేలు కలుగుతుందని వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఏఈఓల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఏఈఓలు, రైతులు బాషానాయక్, బాల్‌రెడ్డి, రాము, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ
అందరి బాధ్యత
వనపర్తి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా రవాణాశాఖ అధికారి జె.సురేష్‌కుమార్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయం, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్, తదితర ప్రదేశాల్లో ఆయన సిబ్బందితో కలిసి వివిధ రకాల మొక్కలు నాటి మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, పచ్చదనం పెంపొందించడంతో భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు అధికారులు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు ఎం.శ్రీకాంత్, జె.సైదులు కానిస్టేబుల్ సంతోష్‌కుమార్, హోంగార్డులు, రవాణాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


