వనపర్తి: ప్రభుత్వ, పైవ్రేట్ ఆస్పత్రుల వైద్యులు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని.. జిల్లాలో ఇకపై డెంగీతో ఒక్క మరణం కూడా నమోదు కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో డెంగీ కేసుల పరిస్థితి, వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో డెంగీతో బాలిక మృతిచెందిన ఘటన గురించి సంబంధిత అధికారులతో వివరాలు, కారణాలు ఆరా తీశారు. డెంగీ కేసును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నోడల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. జ్వరంతో ఆస్పత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, డెంగీ అనుమానం ఉన్న వారికి ర్యాపిడ్, ఎలిసా పరీక్షలు చేయాలని ఆదేశించారు. పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే రోగి పేరు, చిరునామా తదితర వివరాలను ఆరోగ్యశాఖ అధికారులకు అందించాలన్నారు. ఈ సమాచారం ఆధారంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు పరీక్షలు నిర్వహించడంతో పాటు దోమల నివారణకు యాంటీ లార్వా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.


