అమరచింత: ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీసుల కర్తవ్యమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. ఠాణా పరిధిలో గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు. సాయంత్రం వేళ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అవసరమైన చోట సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐని ఆదేశించారు. జాతీయ రహదారిని అనుసరించి ఉన్న గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూరాల ప్రాజెక్టుకు వచ్చే సందర్శకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రద్దీ సమయాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అంకిత భావంతో విధులు నిర్వహించాలని, పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎస్పీ వెంట డీఎస్పీ గిరిబాబు, సీఐ శివకుమార్, ఎస్‌ఐ స్వాతి, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.


