వనపర్తి: వన మహోత్సవంలో భాగంగా సెప్టెంబర్ చివరి నాటికి జిల్లాకు నిర్ధేశించిన మేరకు మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని వీసీ నుంచి అదనపు కలెక్టర్ అటవీ శాఖ అధికారి రేవంత్‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ స్థాయిలో సామూహిక మొక్కల నాటే కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుకూల వాతావరణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ, మనుగడపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వనపర్తి జిల్లాకు వన మహోత్సవం కింద 17 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటివరకు 70 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.


